మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించిన చిహ్నాన్నే అధికారికంగా వాడిన ఏపీ ప్రభుత్వం బుధవారం నూతన చిహ్నాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ జీవో నంబర్ 2ను బుధవారం జారీ చేశారు. మల్టీ కలర్, బ్లూ, బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో వాడుకునేలా చిహ్నాన్ని ఖరారు చేశారు. నిన్నటి వరకు వాడుకలో ఉన్న 1964లో రూపొందించిన చిహ్నంలో పూర్ణకుంభం ఉండగా అదే చిహ్నంలో స్వల్ప మార్పులు చేశారు.
పాత చిహ్నంలో ఆంధ్రప్రదేశ్ పేరు పైన ఆంగ్లంలో, కింద తెలుగు, హిందీలో ఉండేది. కొత్త చిహ్నంలో పేరు పైన తెలుగులో, కింద హిందీ, ఆంగ్లంలో ఉంటుంది. పాత చిహ్నంలో సత్యమేవ జయతే అన్న వాక్యం హిందీలో ఉండగా దాన్ని తెలుగులోకి మార్చారు.