హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ ప్రపంచంలోనే తొలి సోషల్ డ్రింకింగ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. దీన్ని బూజీ (Booozie)గా వ్యవహరిస్తున్నారు. దీని సహాయంతో ఆ సంస్థ వారు మద్యం ప్రియులకు సేవలను అందిస్తారు. అలాగే బార్లు, క్లబ్బులు, వైన్ షాపుల నుంచి మద్యాన్ని మద్యం ప్రియులకు హోం డెలివరీ చేస్తారు. అంతేకాదు. దీనికి ఒక యాప్ కూడా ఉంది. దీని సహాయంతో వారు మద్యం రేట్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు. అలాగే ఫలానా వైన్ షాపు లేదా బార్లో ఏ మద్యం దొరుకుతుంది, రేటెంత తదితర అన్ని వివరాలను ఎప్పటికప్పుడు బూజీ యాప్‌లో మద్యం ప్రియులు తెలుసుకోవచ్చు.
కాగా కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న బార్లు, పబ్‌లు, క్లబ్‌ల వివరాలను బూజీలో ఉంచనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మద్యం ఆన్లైన్ డెలివరీ లేదు. కానీ వీరు అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అంతేకాదు తెలంగాణతోసహా మరో 7 రాష్ట్రాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు వీరు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రియులకు త్వరలోనే మద్యం డోర్ డెలివరీ రూపంలో లభ్యం కానుంది.
ఇక బూజీ సంస్థ వారు రానున్న 6 నెలల కాలంలో 10 రాష్ట్రాల్లో, రానున్న 12 నెలల్లో 20 రాష్ట్రాల్లో సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు పొందే పనిలో పడ్డారు. ఈ స్టార్టప్ ద్వారా వీరు రానున్న ఏడాది కాలంలో సుమారుగా 1 వేయి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన మద్యం విక్రయదారులు, బార్లు, పబ్‌ల వారికి తమ స్టార్టప్ ద్వారా ఆదాయం కొంత వరకు పెరుగుతుందని బూజీ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.
అలాగే భవిష్యత్తులో బార్లు, పబ్‌లు, క్లబ్‌ల వద్ద, వర్చువల్‌గా సోషల్ మీడియాలో వీరు డ్రింకింగ్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. బాధ్యతాయుతమైన డ్రింకింగ్ అంశంపై వీరు అవగాహన కల్పించనున్నారు. ఈ క్రమంలో బూజీ నిర్వాహకులు రానున్న ఏడాది కాలంలో తమ స్టార్టప్‌ను మరింత విస్తరించి ఓ వైపు మద్యం ప్రియులకు సేవలను అందించడంతోపాటు మరో వైపు ఉపాధి అవకాశాలను సృష్టించనున్నారు. అలాగే మద్యం విక్రయదారులు, బార్లు, క్లబ్‌ల ఓనర్లకు ఆదాయం వచ్చేలా అవకాశాలు కల్పించనున్నారు.