విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. గంట గంట కు వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్స్ లో గత నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మునేరు, వైరా, కటలేరు, నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 5లక్షల 10 వేల క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 5లక్షల 05వేలు ఉంది, దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. మరో నాలుగు రోజుల ఇదే ప్రవాహం కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజానీకంతోపాటు లంక ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కృష్ణ గుంటూరు జిల్లాల కలెక్టర్లు,కృష్ణ మునిసిపల్ కమిషనరతో ఫోన్ లో మాట్లాడిన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అప్రమత్తంగా ఉండాలి అని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల మరయు అగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన పునరావాస చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ సూచించారు. కడప, కర్నూలు ,అనంతపురం జిల్లాలలో భారీగా వర్షాలు పడుతుండటంతో ఆయా జిల్లాలో ఇరిగేషన్ సీఈలతో కూడా మంత్రి అనిల్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది.