కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో నీట మునిగిన మొదటి పంప్‌హౌజ్ పునరుద్దరణ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. పంప్‌హౌజ్ నీట మునిగి మూడు రోజులైనా ఇప్పటి వరకు డీ వాటరింగ్ పనులు పుంజుకోలేదు. పంప్‌హౌ్‌స్‌లో చేరిన నీటిని బయటకు తోడే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది . పంప్ హౌస్ నీట మునిగి 11 అంతస్తుల్లో దాదాపు 42 మీటర్ల వరకు నీళ్లు చేరింది . ఈ నీటిని బయటకు తోడేందుకు దాదాపు 600 హెచ్‌పీల సామర్థ్యం గల మోటార్లు అమర్చాల్సి ఉంది. కానీ 300 హెచ్‌పీల సామర్థ్యం గల మోటార్లను తెచ్చి డీ వాటరింగ్ చేస్తున్నారు . మరోవైపు మోటార్లన్నీ నీట మునగడంతో కరెంటు సరఫరాను నిలిపివేసినందున.. జనరేటర్ల ద్వారా నీటిని తోడే ప్రక్రియ సజావుగా సాగడం లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం మూడు అడుగుల నీటిని మాత్రమే బయటకు తోడగలిగారు. కాళేశ్వరం నుంచి పెద్ద మోటర్లు తెప్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఐదు మోటార్లున్నపంప్ హౌస్ మూడో మోటారులో సాఫ్ట్‌వాల్ దెబ్బతిన్నందునే పంప్ హౌజ్ మునిగిందని చెప్తున్నారు. అయితే సాఫ్ట్ వాల్ దెబ్బ తినడానికి కారణం పాలమూరు పనుల బ్లాస్టింగా లేక ఇతర కారణాలా అన్నది మాత్రం నీటిని తోడిన తరువాతే తేలనుంది . ఎంత మేర నష్టం వాటిల్లింది అనే దానిపై కూడా క్లారిటీ రానుంది. సాధారణంగా ఇరిగేషన్ నిపుణుల అంచనాల ప్రకారం 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క పంపును ప్రారంభించాలంటే కనీసం నలభై రోజుల సమయం పట్టేలా ఉంది . ఒకవేళ బ్లాస్టింగ్‌ల ద్వారా మూడో మోటర్ ఫౌండేషన్ బెడ్‌కు నష్టం వాటిల్లి ఉంటే.. … ప్రత్యామ్నాయ చర్యలపై ద్రుష్టి సారించాల్సి ఉంటుంది . తాగునీటి అవసరాల కోసం మొదట ఒక మోటారును ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సీతారామ ప్రాజెక్టు నుంచి ఒక్కొక్కటి 40 లక్షల విలువ చేసే రెండు ప్యానెల్ బోర్డులను తెప్పించినట్లు తెలుస్తోంది.