గత కొన్నాళ్లుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రక్రియ నిన్నటితో ముగిసింది. దీంతో తెలంగాణలో తదుపరి రానున్న ఎన్నికల మీద అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఆ ఎన్నికలు మరేమిటో కాదు జిహెచ్ఎంసి. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆయన రేపు గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం కూడా అందినట్లు సమాచారం. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు రమ్మని ఆయన ఆహ్వానించారని తెలుస్తోంది. మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆయన రేపు సమావేశం నిర్వహించనున్నారు. రేపు జరగనున్న ఈ సమావేశానికి ఒక్కో పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ, అలానే గ్రేటర్ ఎన్నికలకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా ? అని ఆయన అడిగి తెలుసుకోనున్నారు.