నంద్యాలలో జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసుకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం చాలా బాధాకరమన్న ఆయన అసలు ఇలాంటి ఘటనలు చూస్తోంటే రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఏపీలో జగన్ అసమర్థ, రాక్షస ప్రభుత్వానికి కుటుంబాలు బలైపోతున్నాయో ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. సలాంని భరించలేనంత టార్చర్ కు గురిచేసి కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నారని బాబు విమర్శించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే స్థానిక పోలీసులు తెలియనట్లు నటించారని కానీ సలాం కుటుంబసభ్యులు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వచ్చిన వరకూ వాస్తవాలు బయటకు రాలేదని అన్నారు.
వీడియో విడుదల అయ్యాకకూడా పోలీసులు తగు రీతిలో స్పందించలేదన్న ఆయనను ట్వీట్ పెట్టాక పోలీసులు స్పందించారన్నారు. కేసు పెట్టినట్లుండాలి కానీ బెయిల్ రావాలనే రీతిలో పోలీసులు భావించి అలాంటి కేసు పెట్టారని అన్నారు. ఇప్పుడేమో టీడీపీ న్యాయవాది వల్ల బెయిల్ వచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. అసలు న్యాయవాదుల వల్ల బెయిల్ వస్తుందా ? అని ప్రశ్నించిన ఆయన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై బెయిల్ రాకూడని కేసులు పెట్టారని అన్నారు. అసలు ముందు కేసు సక్రమంగా నమోదు చేస్తే విచారణకు ఇద్దరు ఐపీఎస్ అధికారులను పంపాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని ఆయన ప్రశ్నించారు.