మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మహాబలేశ్వర్ పర్యాటకులకు స్వర్గధామంగా ఉంది. పశ్చిమ కనుమల సహజసిద్దమైన అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. పచ్చని ప్రకృతిలో పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చు. సహజసిద్ధమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ సేదదీరవచ్చు. ఇక్కడి స్ట్రాబెర్రీ క్షేత్రాలు, పచ్చని దట్టమైన అటవీ ప్రాంతం పర్యాటకులకు, హనీమూన్‌కు వెళ్లేవారికి మధురానుభూతులను మిగులుస్తాయి.
మహాబలేశ్వరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఆయుర్వేద మొక్కలు ఉంటాయి. అందువల్ల ఈ ప్రాంతంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొద్ది రోజులు గడిపితే ఆ సమస్యలు తగ్గుతాయని చెబుతారు. ఇక మహాబలేశ్వరంలో పచ్చని కొండ ప్రాంతాలు, సహజసిద్ధమైన వాటర్ ఫాల్స్, నదులు, ప్రకృతి, పచ్చని వనాలు ఎన్నో ఉన్నాయి. కొండ ప్రాంతం నుంచి చూస్తూ మహాబలేశ్వరం అందాలను ఎంజాయ్ చేయవచ్చు.
మహాబలేశ్వరంలోని పర్యాటక కేంద్రాల్లో ఎలిఫెంట్ హెడ్ పాయింట్ కూడా ఒకటి. ఇక్కడ కొండ చివరి భాగం ఏనుగు తలను పోలి ఉంటుంది. దానిపైన నిలబడి చూస్తే సహ్యాద్రి పర్వత శ్రేణుల అందాలను ఆస్వాదించవచ్చు. అక్కడి ప్రకృతి ఎంతగానో కనువిందు చేస్తుంది. అలాగే వీణ, గాయత్రి, సావిత్రి, కోయ్‌నా, కృష్ణా నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి. అవి కూడా చూడదగిన ప్రాంతాలే.
మహాబలేశ్వరంలో 30కి పైగా ప్రముఖమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో ఎకో పాయింట్ ఒకటి. అక్కడ నిలబడి పెద్దగా అరిస్తే మన ధ్వని మనకే వినబడుతుంది. అలాగే ఛత్రపతి శివాజీ 1856లో నిర్మించిన ప్రతాప్‌గడ్ కోట కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. దీంతోపాటు మార్జోరీ పాయింట్, క్యాజిల్ రాక్, ఫాక్‌లాండ్ పాయింట్, కర్నాక్ పాయింట్, బాంబే పాయింట్, ధోబీ వాటర్ ఫాల్, ధూమ్ డ్యామ్, బన్నా సరస్సు, ఆర్థర్ సీట్ వంటి ఎన్నో ఆకర్షణీయమైన ప్రాంతాలు మహాబలేశ్వరంలో ఉన్నాయి.
ముంబై, పూణెలకు వెళితే అక్కడి నుంచి మహాబలేశ్వరం వెళ్లవచ్చు. ముంబై నుంచి 220 కిలోమీటర్లు, పూణె నుంచి 180 కిలోమీటర్లు వస్తుంది. పూణె ఎయిర్ పోర్ట్ నుంచి మహాబలేశ్వరం 120 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్సులో వెళ్లవచ్చు. మహాబలేశ్వరంకు 60 కిలోమీటర్ల దూరంలో వతర్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మహాబలేశ్వరంకు సులభంగా వెళ్లవచ్చు. ముంబై లేదా పూణె నుంచి రోడ్డు మార్గంలో అయితే సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. చలికాలం, వేసవి కాలంలలో ఇక్కడ మంచి సీజన్ అని చెప్పవచ్చు.