హైదరాబాద్‌లో టాలెంటెడ్ క్రికెటర్లు తెలంగాణకు వరుసపెట్టి గుడ్‌బై చెప్పేస్తున్నారా ? ఇప్పటికే ఒకరు గోవా వెళ్లిపోయారు. మరొకరు ఆంధ్రాకు చెక్కేశారు. ఇంకా ఎంత మంది ఇదే ఆలోచనతో ఉన్నారన్నది ఇప్పుడు ఆసక్తిరేపుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న పాలిటిక్స్ టాలెంటెడ్ క్రికెటర్లుకు శాపంగా మారిందా…
టీమిండియా క్రికెటర్.. హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు తెలంగాణకు గుడ్‌బై చెప్పడంతో అందరి దృష్టీ HCA పై పడింది. రాయుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో చేరి.. అక్కడి పగ్గాలు కూడా చేపట్టబోతున్నట్టు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలతో విసుగెత్తి అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంబటి వెళ్లిపోతానంటే HCA ఎన్వోసీ ఇచ్చింది కానీ.. ఆపే ప్రయత్నం చేయకపోవడం చర్చకు దారితీస్తోంది. సీనియర్ క్రికెటర్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారట.
వచ్చే నెల 10 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ కోసం విజయనగరంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది ACA.రాయుడు రెండు రోజుల్లో ఆ శిబిరంలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా టీమ్ రెగ్యులర్ కెప్టెన్ హనుమ విహారి ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటంతో.. రాయుడికి పగ్గాలు అప్పగిస్తారని అనుకుంటున్నారు. 2005-06 సీజన్‌లో ఆంధ్రాకు ఆడిన అనుభవం అతనికి ఉంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తర్వాత హైదరాబాద్‌కు మారి.. పదమూడేళ్లగా ఆడుతున్నాడు. హైదరాబాద్ టీమ్‌కు కెప్టెన్ కూడా. రాయుడు సారథ్యంలో హైదరాబాద్ టీమ్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. అయినా రాయుడు వెళ్లిపోతానంటే ఆపకపోవడమే ఆశ్చర్యపరుస్తోందని అంటున్నారు క్రికెటర్లు.
దీనికంతటికీ HCAలో నెలకొన్న రాజకీయాలే కారణమని చెబుతున్నారు. ఇంటర్నల్ పాలిటిక్స్‌నే పట్టించుకుంటూ క్రికెటర్ల గోడు వినడం లేదట. ఇదే కారణంతో హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్ బవనాక సందీప్ సైతం 2 నెలల క్రితం గోవా టీమ్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు అంబటి వంతు వచ్చింది. ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్న హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు. సిరాజ్ అక్కడ ఉండగానే.. హైదరాబాద్‌లో ఆయన తండ్రి చనిపోయారు. టీమిండియాకు ఆడటం తన తండ్రి డ్రీమ్ అని చెప్పిన సిరాజ్.. చివరి చూపునకు రాకుండా అక్కడే ఉండిపోయారు. అయితే సిరాజ్‌ను ఓదారుస్తూ.. ఆయన కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం చేయలేదు HCA. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఒక్కరు కూడా సిరాజ్ ఇంటికి వెళ్లి మాట్లాడలేదు. ఈ విషయంలో HCA తీరును తప్పుపడుతున్నారు అసోసియేషన్‌తో సంబంధం ఉన్నవారు.
టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్.. ప్రస్తుతం HCA ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అజార్ నేతృత్వంలో HCA గాడిన పడుతుందని ఆశిస్తే.. కుమ్ములాటలు ఇంకా ఎక్కువయ్యాయి. అవినీతి ఆరోపణలు.. నిర్లక్ష్యం ఇంకా పెరిగిందనే విమర్శలు.. ఆరోపణలు ఆగడం లేదు. ఎప్పుడూ అసోసియేషన్ గొడవలకు.. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇలాగే ఉంటే.. స్టార్ ప్లేయర్లు ఒకరి వెనక మరొకరుగా HCAకు గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోందట. ఆటగాళ్లు ఉంటే.. వారు బాగా ఆడితే.. ఎవరైనా HCA వంక చూస్తారు. కానీ.. ప్లేయర్లను పట్టించుకోకుండా.. అసోసియేషన్ ప్రతినిధులు తమ సొంత పొలిటికల్ గేమ్‌కు ప్రాధాన్యం ఇస్తన్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి.