ఓ వైపు 2020 సంవత్సరం ముగుస్తోంది. మరోవైపు ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ పలు పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు సపోర్ట్‌ను అందించడం నిలిపివేయనుంది. పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్లకు ఇకపై వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే కనీసం ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ ఉండాలి. అదే ఐఫోన్లు అయితే వాటిల్లో కనీసం ఐఓఎస్ 9.0 ఆపైన వెర్షన్ ఉండాలి. అలా ఉన్న ఫోన్లలోనే వాట్సాప్ పనిచేయనుంది.
వాట్సాప్ సపోర్ఠ్ పేజీలో ఇప్పటికే పైన తెలిపిన విషయాన్ని వెల్లడించారు. వాట్సాప్‌లో అందిస్తున్న ఫీచర్లన్నింటినీ ఉపయోగించుకోవాలంటే ఆండ్రాయిడ్ యూజర్లు 4.0.3 ఆపైన, ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 9.0 ఆపైన వెర్షన్‌లను తమ తమ ఫోన్లలో కలిగి ఉండాలని సదరు సపోర్ట్ పేజీలో చెప్పారు. అంటే యూజర్లు పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు కలిగిన ఫోన్లను వాడడం మానేయాలన్నమాట. లేదంటే వాట్సాప్‌ను ఇకపై ఆ ఫోన్లలో ఉపయోగించుకోలేరు.
వాట్సాప్ తెలిపిన వివరాల ప్రకారం ఐఫోన్ 4ను వాడేవారు ఇకపై అందులో వాట్సాప్‌ను పొందలేరు. ఇక ఐఫోన్ 4ఎస్, 5, 5ఎస్, 6, 6ఎస్ ఫోన్లను వాడేవారు తమ తమ ఐఫోన్లలో ఐఓఎస్‌ను 9.0 లేదా అంతకు పైన వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్‌ను ఆయా ఫోన్లలో ఉపయోగించుకోలేరు.
ఇక ఆండ్రాయిడ్ విషయానికి వస్తే వాటిల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ కనీసం 4.0.3 లేదా ఆపైన వెర్షన్ ఉండాలి. అంతకన్నా తక్కువ వెర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై వాట్సాప్‌ను పొందలేరు. ఈ క్రమంలో హెచ్‌టీసీ డిజైర్, ఎల్‌జీ ఆప్టిమస్ బ్లాక్, మోటోరోలా డ్రాయిడ్ రేజర్, శాంసంగ్ గెలాక్సీ ఎస్2 ఫోన్లను వాడేవారు వాటిని తీసేసి కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది ముగుస్తుండడంతో యూజర్లు వీలైనంత త్వరగా కొత్త ఓఎస్ వెర్షన్‌లకు అప్‌డేట్ అవ్వడమో లేదా ఫోన్లను మార్చడమో చేయాలి. లేదంటే వాట్సాప్‌ను ఆయా ఫోన్లలో ఉపయోగించుకోలేరు.
ఇక ఐఫోన్ యూజర్లు ఫోన్‌లోని సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి అందులో ఉండే జనరల్‌లోని ఇన్ఫర్మేషన్ ఆప్షన్‌ను ఎంచుకుంటే తమ ఐఫోన్‌లో ఉన్న ఐఓఎస్ వెర్షన్ ఏమిటన్నది తెలుస్తుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ ఫోన్ ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులో తమ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ ఎంత అనేది తెలుస్తుంది. దీంతో అందుకు అనుగుణంగా ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. కుదరకపోతే ఫోన్‌లను మార్చాల్సి ఉంటుంది.
కాగా గతేడాది వాట్సాప్ ఐఓఎస్ 8 అంతకన్నా తక్కువ, ఆండ్రాయిడ్ 2.3.7 అంతకన్నా తక్కువ ఓఎస్ వెర్షన్ ఉన్న ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేసింది. ఇక ఇప్పుడు మళ్లీ పైన తెలిపిన డివైస్‌లకు సపోర్ట్‌ను నిలిపివేయనుంది.