ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్వగ్రామమైన ఎలమర్రులో టిడిపి మద్దతు ఇచ్చిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద మంత్రి కొడాలి నాని స్పందించారు. గుడివాడ నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో సమావేశమైన కొడాలి నాని ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
పామర్రు నియోజకవర్గం లో ఉన్న ఎలమర్రులో వైసిపి ఓడిపోతే అది నాకు ఎదురు దెబ్బ అని సంబరాలు చేసుకుంటున్నారు అని లేనిపోనివి వ్రాసి చంద్రబాబు నాయుడు సంక నాకుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఎలమర్రులో మా పూర్వీకులు ఉండేవారని, నేను మా నాన్న గుడివాడలోని పుట్టామని గుడివాడ తమ సొంత ఊరు అని చెప్పుకొచ్చారు. అసలు యలమర్రులో ఎవరు వైసిపి నాయకులో ఎవరు తెలుగుదేశం నాయకులో తనకు తెలియదని ఆయన అన్నారు. ఎలమర్రు వచ్చి తాము ఎవరినైనా ఓటు వేయమని కోరినట్టు నిరూపిస్తే రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.