మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కస్టమరా ? ఆ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్ కార్డులను వాడుతున్నారా ? అయితే జాగ్రత్త. మీలాంటి వారినే కొందరు దుండగులు టార్గెట్‌గా చేసుకుని టెక్ట్స్ మెసేజ్ లను పంపిస్తూ అందిన కాడికి డబ్బులను దోచేస్తున్నారు. ప్రస్తుతం అధిక సంఖ్యలో ఎస్బీఐకి చెందిన క్రెడిట్ కార్డుల వినియోగదారులు ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన సైబర్ పీస్ ఫౌండేషన్, ఆటోబాట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి రివార్డు పాయింట్లను రూపాయలు లేదా గిఫ్ట్‌లుగా మార్చుకోవాలని టెక్ట్స్ మెసేజ్ లు వస్తాయి. అవి ఎస్బీఐ నుంచి వచ్చే మెసేజ్‌లను పోలి ఉంటాయి. దీంతో వాటిని నిజంగానే ఎస్బీఐ పంపిందనుకుని వినియోగదారులు ఆ మెసేజ్ లలో ఉండే లింక్‌లను క్లిక్ చేస్తారు. అనంతరం వేరే వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వినియోగదారులకు చెందిన ఎస్బీఐ క్రెడిట్ కార్డుల వివరాలను నమోదు చేయమని అడుగుతారు. అందులో పేరు, కార్డు నంబర్, తేదీ, సీవీవీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలు ఉంటాయి.
ఈ క్రమంలో ఆయా వివరాలన్నింటినీ నమోదు చేశాక.. వెబ్పేజీలోనే థాంక్ యూ అనే మెసేజ్ దర్శనమిస్తుంది. తరువాత కొంత సేపటికి వినియోగదారుడికి చెందిన క్రెడిట్ కార్డులో ఉండే మొత్తం మాయమవుతుంది. ఈ తరహా మోసాలను ఫిషింగ్ స్కామ్‌లు అంటారు. అంటే.. అసలైన సంస్థలకు చెందిన వారిగా వినియోగదారులను నమ్మించి మోసం చేస్తారన్నమాట. నిజమైన సంస్థలుగా నమ్మించడమే కాక, ఆయా సంస్థలను పోలిన వెబ్సైట్లను సృష్టించి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతారు.
వినియోగదారులకు అసలు, నకిలీ వెబ్సైట్లకు తేడాలు సరిగ్గా తెలియవు. దీంతో వారు సులభంగా ఈ తరహా మోసాలకు గురవుతుంటారు. ప్రస్తుతం ఈ మోసాలు పెరిగాయని, వినియోగదారులు తమకు ఇలాగే రివార్డు పాయింట్లను కన్వర్ట్ చేస్తామని ఎవరైనా కాల్ చేసినా, మెసేజ్ లు పంపినా నమ్మవద్దని, ఒకసారి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లేదా బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలను తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అనవసరంగా ఫిషింగ్ స్కామ్ బారిన పడి డబ్బును నష్టపోవాల్సి వస్తుంది.