కడప: కలసపాడు మండలం మామిళ్ళపల్లె వద్ద ముగ్గు రాళ్ళ గనిలో భారీ ప్రమాదం జరిగింది. కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు పదార్ధాలు బ్లాస్టింగ్ అయ్యాయి. దీంతో 10 మందికి పైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం.
జిలెటిన్ స్టిక్స్ బొలేరో వాహనంలో గనిలోకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. పేలుడు దాటికి బొలేరో వాహనం గాల్లోకి ఎగిరిపడింది. దీంతో బొలేరో వాహనం కిందపడి నలుగురు మృతి చెందారు. ఈ మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలిస్తున్నారు. అయితే మృతుల సంఖ్యపై పోలీసులు, అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మరిన్ని విషయాలు దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రమాదానికి గని యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలు అంటున్నారు. గనిలో తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని, క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.