పక్క రాష్ట్రం తెలంగాణతో సహ అన్నీ రాష్ట్రాలు ఇంటర్, పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఈ పరీక్షలను ఎటు తేల్చలేకపోతున్నాయి. దీంతో అటు విద్యార్థులు, వారి పేరెంట్స్ లో కలవరం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని.. స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయని..కోవిడ్ పరిస్థితి ఉందనే పరీక్షలను వాయిదా వేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో అనేక మార్గాలుంటే.. పరీక్షల రద్దు అనే మాట ఎందుకు..? అని ప్రశ్నించారు. లోకేష్ పరీక్షల్లో నిలబడకుండా దొడ్డి దారిన పదవులు పొందారో.. అలా చేయాలనుకుంటే ఎలా..? అని ఎద్దేవా చేశారు. మంగళగిరి పరీక్షల్లో లోకేష్ ఎలా బొక్క బోర్లా పడ్డారో అందరం చూశామని.. చురకలు అంటించారు.
కళాశాలల్లో కానీ.. పాఠశాలల్లో కానీ అడ్మిషన్లు చేసుకోవడానికి వీల్లేదని..ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా అడ్మిషన్లు ప్రారంభిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్సీ 2008 బాధితులకు న్యాయం చేస్తున్నామని.. 2190 మంది డీఎస్సీ 2008 అర్హులకు ఎస్జీటీ పోస్టింగులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన వారికి న్యాయం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు. డీఎస్సీ 2008 బాధితులకు న్యాయం చేస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని… టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టి నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. డీఎస్సీ 2008 బాధితులకు ఆనందం కలిగిస్తున్నామని…డీఎస్సీ 2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ చేపడతామని తెలిపారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా భర్తీ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు.