టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్‌ను సాధించిన విషయం విదితమే. దీంతో భారత్ ఈసారి ఒలంపిక్స్‌లో పతకాల ఖాతా తెరిచింది. ఈ క్రమంలోనే ఆమెను దేశం మొత్తం అభినందిస్తోంది. అయితే పోటీకి ముందు తన పరిస్థితి గురించి మీరాబాయి చాను వివరించింది. తాను ఎలాంటి స్థితిలో ఉందో తెలియజేసింది.
పోటీ ప్రారంభానికి రెండు రోజుల నుంచి అసలు ఏమీ తినలేదని మీరాబాయి చాను తెలిపింది. తినే ఆహారం తన బరువుపై ప్రభావం చూపిస్తుందేమోనని ఆమె ఆందోళన చెందింది. అందుకనే ఆమె రెండు రోజులు ఏమీ తినలేదు. ఈ విభాగంలో పోటీలో పాల్గొనాలంటే కచ్చితమైన బరువు ఉండాలి. బరువులో తేడాలు రాకూడదు. అందుకనే ఆహారం తీసుకోలేదని తెలియజేసింది.
గతంలో జరిగిన రియో ఒలంపిక్స్ లో మెడల్ సాధించాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఆమె మెడల్‌ను సాధించింది. ఇందుకు తన కోచ్ విజయ్ శర్మ ఎంతో ప్రేరణనిచ్చారని, తనను వెన్ను తట్టి ప్రోత్సహించారని తెలిపింది. రియో ఒలంపిక్స్‌లో జరిగింది మరిచిపోయి మళ్లీ పోటీలపై దృష్టి పెట్టాలని చెప్పారని తెలిపింది. అందుకనే ఈసారి ఎలాగైనా మెడల్‌ను సాధించాలనే పట్టుదలతో పాల్గొని మెడల్‌ను సాధించానని తెలిపింది.