ఆప్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను కేంద్రం తిరిగి వెనక్కి తీసుకువస్తోంది. అందుకు ప్రత్యేక విమానాలను కాబూల్‌కు నడిపిస్తున్నారు. అయితే కాబూల్‌లో ఉన్న ఇండియన్ ఎంబస్సీ సమీపంలో ఆగస్టు 15న పేలుడు వినిపించడంతో అక్కడ ఉన్న భారతీయులను, అధికారులను ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చేందుకు, అక్కడి నుంచి ఇండియాకు తీసుకువచ్చేందుకు పలు బృందాలు చాలా చాకచక్యంగా పనిచేశాయి.
ఆగస్టు 15న కాబూల్‌లోని ఇండియన్ ఎంబస్సీకి సుమారుగా 70 మీటర్ల దూరంలో బ్లాస్ట్ వినిపించింది. అప్పటికే అక్కడి భారతీయులను ఎయిర్‌పోర్ట్‌కు తరలించే ఆపరేషన్ చేపట్టారు. కానీ అక్కడికి 15 కిలోమీర్ల దూరం ఉంటుంది. అధికారులు, ఇతర భారతీయులు కలిపి 150 మంది ఉన్నారు. దీంతో అందరినీ ఒకేసారి తరలించడం ఇబ్బంది అవుతుంది కనుక దళాలు రెండు బృందాలుగా ఏర్పడ్డాయి.
మొదటి టీమ్ లో 46 మంది ఆగస్టు 16న ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రెండో టీమ్‌లో 99 మంది ఆగస్టు 17న ఎయిర్ పోర్టుకు వచ్చారు. రెండో టీమ్‌లో ఇండియన్ అంబాసిడర్, ఐటీబీపీ కమాండోలు, ముగ్గురు మహిళలు, ఎంబస్సీ సిబ్బంది ఉన్నారు. అయితే రెండు టీమ్‌లు కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకునేందుకు చాలా శ్రమ పడ్డాయి. ముఖ్యంగా తాలిబన్లు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ టీమ్‌లు చాలా తెలివిగా ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడి నుంచి వారిని ప్రత్యేక విమానంలో గుజరాత్‌కు తరలించారు.
ఇండియన్ ఎంబస్సీ నుంచి భారతీయులను కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలించేందుకు 2 టీమ్‌లు సుమారుగా 56 గంటల పాటు శ్రమించాయి. కేవలం 15 కిలోమీటర్ల దూరమే అయినా ప్రయాణం మొత్తం బిక్కు బిక్కుమంటూ సాగింది. ప్రయాణం ఆద్యంతం వారు ఏమీ తినలేదు. తాగలేదు. ఎట్టకేలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.