ఆ భార్యాభర్తలిద్దరు మాట్లాడుకోవటం మానేశారు..ఎవరిబతుకు వారు అన్నట్లు జీవిస్తున్నారు. వీరి జీవితంలోకి ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఓ పథకం అగ్గిరాజేసింది. ఆధార్ కార్డుతో మొదలైన వీరి గొడవ ఒకరి హత్య వరకూ వెళ్లింది. అది ఎలాగో అనుకుంటున్నారా.. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి మీరు తెలుసుకోండి..
మూడుముళ్ల బంధంతో అగ్నిసాక్షిగా ఒక్కటైన జంటలు ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోలేక కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నాయి. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు వారి జీవితాన్నే తలకిందులు చేస్తున్నాయి. ఈ సమస్య నూతన జంటల్లోనే కాదు..దశాబ్దాల కిందట పెళ్లైన వారి కాపురాల్లోనూ ఉంది.
పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన మాధవరెడ్డి(55)కి పాతికేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కాంతమ్మతో పెళ్లైంది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా.. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ మంచిగా పెళ్లిళ్లు కూడా చేసేశారు. కొన్నేళ్ల క్రితం దురదృష్టవశాత్తూ.. కుమారుడు ప్రమాదంలో మరణించాడు. వారికున్న ఎకరం పొలాన్ని సాగుచేస్తుూ దంపతులు కొంత కూడబెట్టారు. ఆ డబ్బును కాంతమ్మ ఆమె సోదరులకు అప్పుగా ఇచ్చింది. ఇక్కడ మొదలైంది గొడవ.. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు
డబ్బు కోసం భార్యను వేధించేవాడు..మొత్తానికి కొంతకాలానికి ఆమె పుట్టింటివారు డబ్బులు తిరిగిచ్చినా మాధవరెడ్డికి భార్యపై కోపం తగ్గలేదు. ఇటీవల మాధవరెడ్డికి పక్షవాతం రావడంతో మంచానపడ్డాడు. భార్యతనను సరిగా చూసుకోవడం లేదంటూ నిత్యం ఆమెతో గొడవ పడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల్లేవు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరిజీవితం వారిదే అన్నట్లు ఉండేవారు. ఇలా సాగుతున్న వారి జీవితంలో సడన్ అగ్గిరాజేసే ఘటన జరిగింది.
ఐతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకం భార్యాభర్తల మరోసారి గొడవ జరిగింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కాంతమ్మ గ్రామ సచివాలయానికి వెళ్లింది. పత్రాలన్నీ చూసిన అక్కడి సిబ్బంది భర్త ఆధార్ కార్డు కావాలని చెప్పారు. ఇక్కడ వచ్చింది అసలు చిక్కు.. భర్తతో మాటలు లేకపోవడంతో ఆధార్ కార్డు ఇవ్వాలంటూ తెలిసిన వ్యక్తితో అడిగించింది. ఐతే తనను నేరుగా అడగకుండా వేరొకరితో అడిగిస్తావా నిన్ను చంపేస్తానంటూ మాధవరెడ్డి భార్య కాంతమ్మను బెదిరించాడు.
దీంతో భయపడిపోయిన కాంతమ్మ.. భర్తను తనే చంపాలని నిర్ణయానికి వచ్చింది. మాధవరెడ్డి నిద్రపోతున్న సమయంలో అతని తలపై రోకలిబండతో మోదింది.అప్పటికి ఆగలేదు.. రక్తపుమడుగులో ఉన్న భర్త చనిపోయాడో లేదో అనుకొని కత్తితో మెడపై నరికింది. అప్పటికీ నమ్మకం లేక నోట్లో పురుగుల మందు పోసింది. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పుట్లూరు సీఐ మల్లికార్జునగుప్త, పెద్దపప్పూరు ఎస్‌ఐ గౌస్ మహ్మద్ కాంతమ్మను అదుపులోకి తీసుకున్నారు.