వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన విషయం విదితమే. లండన్‌లో ఉన్న కుమార్తెలను చూసేందుకు భార్య భారతిలో కలసి వెళ్లిన జగన్ ఏపీకి రాగానే నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ కొత్త ఇంటిని నిర్మించుకోగా.. ఆ ఇంట్లోకి ఇవాళ కుటుంబ సభ్యులతో కలసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
ఉదయం 8:19 గంటలకు వైఎస్ జగన్, భారతి దంపతులతోపాటు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు సర్వమత ప్రార్థనలు చేసి ఇంట్లోకి అడుగుపెట్టారు. కాగా జగన్ వెంట వైకాపా నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాంలు ఉన్నారు. ఈ క్రమంలోనే నూతన ఇంట్లోనే ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా జగన్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
అయితే ఈ నెల 14వ తేదీన ఉదయం 8:21 గంటలకు గృహ ప్రవేశం చేయాలని ముందుగా నిర్ణయించారు. కానీ పలు కారణాలతో గృహ ప్రవేశాన్ని వాయిదా వేశారు. అనంతరం జగన్ లండన్ వెళ్లి రావడంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా నూతన గృహంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడంతో ఇకపై ఇక్కడి నుంచే జగన్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లో కార్యాలయం ఉండడంతో జగన్‌తోపాటు అటు వైకాపా నాయకులు, కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం ఇకపై సులభతరం కానుంది..!