గంట కొట్టి లిస్టింగ్ ప్రారంభించి సీఎం చంద్రబాబు
ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ జారీ చేసిన బాండ్ల నమోదును సోమవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంట కొట్టి ప్రారంభించారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్సీ)లో అమరావతి బాండ్లు లిస్ట్ అయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫాంపై బాండ్లను జారీ చేయగా గంట వ్యవధిలో రూ.2వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. వాటినే ఈరోజు లిస్టింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశీష్ కుమార్, మంత్రులు యనమల, నారాయణ, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు కుటుంబరావు, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఎస్ఈ సీఈవో, ఎండీ మాట్లాడుతూ.. ఏపీని పెట్టుబడుల ఆకర్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో నిలబెట్టారని, టెక్నాలజీ వాడకంలోనూ ఏపీ ప్రథమస్థానంలో కొనసాగుతోందని ఆయన కొనియాడారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ధీర్ఘకాలిక విజన్తో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంకోసం సంకల్పించామని అందులో భాగంగానే నిధుల సమీకరణ జరుగుతోందన్నారు. నాడు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి ప్రణాళికలు రచించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ గా మార్చామన్నారు. ప్రపంచంలో ఐదు అత్యుత్తమ నగరాల్లో జాబితాలో అమరావతిని ఒకటిగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.