కర్ణాటకలో ఇటీవల ఓ రైతు పికప్ ట్రక్ కొనేందుకు మహీంద్రా షోరూంకు వెళ్లే సేల్స్ మెన్ అవమానకరంగా మాట్లాడటం… ఆ తరువాత గంటలోనే రూ. 10 లక్షలు తీసుకువచ్చి ట్రక్ డెలవరీ చేయాలని కోరడం.. ఆ తరువాత సదరు షోరూం యాజమాన్యం రైతుకు క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.
తాజాగా ఈ ఘటనపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన దీనిపై స్పందించారు. ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ వేదికగా.. “మహీంద్రా.. తమ ప్రజలు, పెట్టుబడిదారులకు శక్తినిచ్చేలా తోడ్పడుతుంది. వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుతుంది. ఇలాంటి వాటికి ఏమైనా ఇబ్బంది జరిగితే అత్యవసరంగా పరిష్కరిస్తాం.” అని ట్వీట్ చేశారు.
ఇటీవల కర్ణాటకలోని తుముకూరుకు చెందిన కెంపెగౌడ అనే రైతు మహేంద్ర బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు తన స్నేహితులతో కలిసి షోరూంకు వెళ్లాడు. వీరి వేషధారణ చూసి సెల్స్ మెన్ ట్రక్ ధర మీరనుకుంటున్నట్లు రూ. 10 కాదని హేళనగా మాట్లాడారు. దీంతో గంట వ్యవధిలోనే కెంపెగౌడ రూ. 10 లక్షలు తీసుకువచ్చి ట్రక్ డెలవరీ చేయాలన్నారు. దీంతో అవాక్కయిన షోరూం సిబ్బంది మూడు రోజుల్లో డెలవరీ చేస్తాం అని అన్నారు.
దీంతో అక్కడి నుంచి స్థానికంగా ఉన్న తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రైతు కెంపెగౌడ షోరూం యాజమాన్యంపై ఫిర్యాదు చేశాడు. అయితే దిగివచ్చిన షోరూం యాజమాన్యం రైతుకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు తెలియజేసింది. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో సమస్య ముగిసింది. షోరూంలో జరిగిన ఘటనను ఓ వ్యక్తి వీడియో తీయడం… అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆనంద్ మహీంద్రా కూడా స్పందించాల్సి వచ్చింది.