అక్కడ ఓటేయాలంటే ఒకరోజు ముందే కొండ దిగి రావాలి…!

-

తమ జీవితాల్లో ఇకనైనా మార్పు వస్తుందేమోనని దశాబ్దాలుగా వాళ్లు కొండలు, గుట్టలు దిగి ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటేస్తారు. కానీ.. వాళ్ల బతుకులు మాత్రం మారవు. ఓటు అనే ఆయుధాన్ని సరైన నేతను ఎన్నుకోవడం కోసం ఉపయోగించినా.. అక్కడి నేతలకు మాత్రం వాళ్లు ఓటు వేయడం కోసం పడే పాట్లు కనిపించవు..

సాధారణంగా ఓటేయడానికి ఓ గంట ముందో రెండు గంటల ముందో పోలింగ్ కేంద్రానికి బయలుదేరుతారు. కానీ.. అక్కడ ఓటేయాలంటే గంట రెండు గంటల ముందు బయలు దేరితే సరిపోదు. ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రం దగ్గరికి రావాలి. అవును.. లేదంటే వాళ్లు ఓటేయలేరు. వాళ్లు పోలింగ్ కేంద్రం చేరుకోవాలంటే ఏదో రోడ్డు నుంచి నడుస్తూ పోవడం కాదు.. కొండలు, గుట్టలు దిగి రావాలి. ఏపీలోని విశాఖ జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాల్లో ఉంటే ఓటర్ల పరిస్థితి ఇది.

Tribal villagers suffering to vote in Vizag agency area

జిల్లాలోని నాతవరం మండలంలో ఉన్న 27 గ్రామ పంచాయతీల్లో ఉన్న 82 శివారు గ్రామాల్లో 16 గ్రామాలు గోదావరి జిల్లాల సరిహద్దులో కొండల మీద ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజల ఓటింగ్ కోసం ఎన్నికల అధికారులు 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ.. వాటిని కొండల మీద ఉన్న ఆ గ్రామాల దగ్గర కాదు.. కొండల కింద ఉన్న సరుగుడు గ్రామంలో. ఆ గ్రామానికి రావాలంటే.. కొండలు, గుట్టలు దాటి దాదాపు 10 కిలోమీటర్ల దూరం నడవాలి. అందుకే.. వాళ్లు ముందురోజే కొండలను దాటి నడుచుకుంటూ వచ్చి సరుగుడు గ్రామంలో రాత్రి పడుకొని.. తెల్లారి ఓటేసి మళ్లీ తమ గ్రామాలకు వెళ్తుంటారు. ఇది ఎప్పటి నుంచో ఇలా జరుగుతున్న తంతు.

యువకులు, మహిళలు ఓటేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ.. వృద్ధులు కొండలు గుట్టలు దాటి కిందికి రావాలంటే మాత్రం కష్టంతో కూడుకున్న పనే. అందుకే.. ఆ గ్రామాల్లో నివసించే వృద్ధులు ఓటేయడానికి వెనుకంజ వేస్తున్నారట. సరుగుడు పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 3800 మంది గిరిజనులు కొండలు దిగి వచ్చి ఓటేస్తారు. వీళ్లతో పాటు.. కొండల దిగువన ఉన్న గ్రామాల ప్రజలు కూడా సరుగుడు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటేయాల్సిన పరిస్థితి. దీంతో వాళ్లు కూడా 4 నుంచి 5 కిలోమీటర్లు నడుస్తూ వచ్చి ఓటేయాలి.

దశాబ్దాలుగా ఇలా విశాఖ ఏజెన్సీలోని గిరిజన ప్రజలు ఓటు కోసం పడుతున్న దురవస్థ ఇది. ప్రజల బాగు కోసం.. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాల్సిన ప్రభుత్వాలు వాళ్లతో ఓటేయించుకొని తర్వాత మళ్లీ వాళ్లకు కన్పించిన దాఖలాలు లేవు. దీంతో దశాబ్దాలుగా వాళ్లు ఓటు కోసం ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని.. అక్కడే ఉండి.. తెల్లారి లేసి ఓటేసి పోవాల్సి వస్తోంది. ఓటు వేయడానికి లంక గ్రామాల ప్రజలు పడుతున్న పాట్లను మాత్రం అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఎన్నికల కమిషన్ కానీ పట్టించుకోవడం లేదని వాళ్లు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news