తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులకు త్వరలో ఉపశమనం కలుగనుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోగా.. అందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 21న మంత్రుల బృందంతో కూడిన మంత్రి వర్గ సబ్ కమిటీ సమావేశం కానున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తుంది.
వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఫీజు నియంత్రణపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫీజు నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న నిబంధనలపై విద్యాశాఖ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ తరువాత మంత్రుల ముందు సమర్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టడంపై సబ్ కమిటీ చర్చించనున్నది.
ప్రస్తుతం నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేకించి పాఠశాలలు ట్యూషన్ ఫీజు పేరుతో తల్లిదండ్రుల నుంచి అధికంగా డబ్బులు దండుకుంటున్నాయి. ప్రతీ సంవత్సరం 30 నుంచి 40 శాతం వరకు ఫీజులను పెంచుతున్నాయి. జేఈఈ, నీట్, ఎంసెట్ వంటిప్రవేవ పరీక్షల కోసం ఇంటెన్సివ్, స్పెషల్ కోచింగ్‌ను పేర్కొంటూ ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో విసిగి పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.