తెలంగాణతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేదు : కేంద్రానికి ప్రశాంత్ రెడ్డి వార్నింగ్‌

-

తెలంగాణతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేదు : కేంద్రానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామని.. ఉగాది తరువాత కేంద్రంతో పోరు షురూ చేస్తామని వెల్లడించారు. పీయూష్ గోయల్ అహంకారాన్ని తెలంగాణ సమాజం సహించదని.. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించాలంటావా? అని నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం కేవలం ధాన్యం విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లో తెలంగాణపై కక్షసాధింపుగా వ్యవహరిస్తోందని.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజల పట్ల మాట్లాడిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వరి పండించాలని రైతులను రెచ్చగొట్టి నా బండి సంజయ్ ఇప్పుడు మొహం చాటేశారని.. బండి సంజయ్ కి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర పెద్దలను ఒప్పించాలని డిమాండ్‌ చేశారు.

దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని.. తెలంగాణలో ప్రతి గ్రామంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం స్పందించకుంటే రానున్న రోజుల్లో మరింత తీవ్రతరమైన ఉద్యమం చేస్తామని మంత్రి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news