రాజకీయాలు ఎలా ఉన్నా కూడా వాటిని అర్థం చేసుకోవడంతో తెర వెనుక దాగి ఉన్న దుర్వినీతి (చెడ్డనీతి) ఒకటి తప్పక వెల్లడి అవుతుంది. ఆ విధంగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఉన్నాయి అని చెప్పడంలో ఏ తప్పిదం లేదు. అవన్నీ వాస్తవాలే. కనుక మాల్యాను గడ్కరీ సపోర్టు చేసినా, ఆయన తప్పు ఏం లేదని ఈ రోజు క్లారిఫై చేస్తూ, కాండక్ట్ సర్టిఫికెట్ ఒకటి ఇచ్చినా ఏం చేసినా పార్టీలకే చెల్లు. ఆ విధంగా మాల్యా ఇప్పుడు మంచోడు. ఆ విధంగా అతడు ధీరోదాత్తుడు. అందుకే పార్టీలు ఏం మాట్లాడినా నవ్వుకోవాలి. చెల్లని రూపాయి కాసులాంటి మాటలు కొన్ని ఉంటాయి విని ఊరుకోవాలి. ఇదే ఇవాళ్టి రాజకీయం. నయా రాజకీయం.
ఇక కొత్త తరహా రాజకీయంలో భాగంగా చింతన్ శివిర్ లో భాగంగా పాపం కాంగ్రెస్ కొన్ని విషయాలు తవ్విపోస్తోంది. ఇప్పటికే కులాలు వారీగా కొట్టుకు ఛస్తున్న వర్గాల్లో కొత్త ద్వేషం ఒకటి నింపి వెళ్లాక, తమకు అనుగుణంగా విజయావకాశాలు వర్థిల్లాలని యోచిస్తోంది. ఎడారి దారుల చెంత నిన్నటి వేళ చేసిన ఉదయ్ పూర్ డిక్లరేషన్ చూస్తే ఉక్రోషం మాట దేవుడెరుగు కానీ కనీస స్థాయిలో మనుషులను వారి మనసులనూ కలిపి ఉంచే ఏ చిన్న ప్రయత్నమూ జరగడం లేదు అన్నది ఓ వాస్తవం. ఇదే నూరు పైసల నిజం.
ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ విభజిత శక్తులుగా ఉన్నాయి. మతం పేరిట రాజకీయం నడిపి త్వరలోనే సెక్యులర్ అనే పదాన్ని కూడా రాజ్యాంగం నుంచి తొలగిస్తామని బీజేపీ వాదిస్తుంటే, కులం పేరిట రాజకీయం నడిపి అత్యంత సున్నితం అనుకునే విషయాలను పోగేసి మాట్లాడి, పబ్బం గడుపుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. అంటే మనుషులను వీరు కులాలుగా., మతాలుగా
చూస్తారే తప్ప మనుషులుగా చూడడం చేతగావడం లేదు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు నయా రూలింగ్ కోసం తెగ తాపత్రయ పడడమే నేటి వివాదం. విచారకరం కూడా !