ఈ ఏడాడి నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. అంతేకాకుండా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలోనే దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.
నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అదే సమయంలో బలమైన వేడి గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ కూడా బలమైన వేడిగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.