బ్యాంకింగ్ సేవలను పొందాలంటే గతంలో అయితే కచ్చితంగా బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. దీంతో బ్యాంకింగ్ సేవలు మన చేతి వేళ్లలోనే లభిస్తున్నాయి. ఫోన్లు, కంప్యూటర్లలో బ్యాంకింగ్ సేవలను మనం వినియోగించుకుంటున్నాం. అయితే ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రం ఆన్ లైన్ బ్యాంకింగ్‌లో కొన్ని సేవలు ఎక్కువగానే లభిస్తున్నాయని చెప్పవచ్చు. వాటిల్లో బ్రాంచ్ మార్పు ఒకటి. ఇంతకు ముందు ఖాతాదారులు బ్రాంచ్ మారాలంటే.. బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారానే మనం కావాలనుకున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు ఖాతాను మార్చుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాను ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్‌కు మార్చాలంటే ఇలా చేయాలి..!
* ముందుగా ఎస్‌బీఐ వెబ్‌సైట్ www.onlinesbi.com ఓపెన్ చేయాలి.
* పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్‌ను ఎంచుకుని అనంతరం వచ్చే విండోలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* హోం స్క్రీన్ పై భాగంలో ఉండే ఇ-సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
* ఇ-సర్వీసెస్ మెనూలో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకోవాలి.
* మీ రిజిస్టర్డ్ అకౌంట్ నంబర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిల్లో ఏ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి.
* ఒక వేళ మీకు ఒక్కటే ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే డిఫాల్ట్‌గా సెలెక్ట్ అవుతుంది.
* మీరు ట్రాన్స్‌ఫర్ అవ్వాలనుకుంటున్న బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయాలి.
* టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేసి సబ్‌మిట్ నొక్కాలి.
* తరువాత వచ్చే విండోలో ప్రస్తుత బ్రాంచ్ కోడ్, కొత్త బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయాలి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి కన్‌ఫాం బటన్‌ను క్లిక్ చేయాలి.
అంతే.. వారం రోజుల్లో మీ అకౌంట్ మీరు కావాలనుకున్న మరొక బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే ఈ సేవను మీరు ఉపయోగించుకోవాలంటే మీ బ్యాంక్ ఖాతాకు చెందిన కైవైసీ వివరాలు అప్‌డేటెడ్‌గా ఉండాలి. అలాగే మొబైల్ నంబర్ బ్యాంకులో రిజిస్టర్ అయి ఉండాలి. దీంతో మీరు కావాలనుకున్న బ్రాంచ్‌కు సులభంగా మీ ఖాతాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.