ఎనిమిదేళ్ల ప్రాయాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఈ మారు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరులకు అంజలి ఘటించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు. సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2వ తేదీన భారతదేశంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిదో ఏట అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తోందన్నారు.
ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోష పడాల్సిన సందర్భం అన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజురోజుకూ గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటోందని సీఎం తెలిపారు. కేంద్రంతో సహా పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు-రివార్డులు, ప్రశంసలే ఇందుకు సాక్ష్యమన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి దేశానికే పాఠం నేర్పుతోందని తెలిపారు. నూతన రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆటంకం కలిగిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.