ఇంకో రెండు రోజులే గడువు ఉండటంతో త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించనున్నారట.
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫలితాలపైనే అందరి దృష్టి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. అవే లెక్కలు. అయితే.. ఈ నేపథ్యంలో ఏపీలో మరో ఘటన చోటు చేసుకోబోతున్నది. అది ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.
అదేంటి.. కొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఆయన రాజీనామా ఎందుకు చేస్తున్నారు. కొంపదీసి వేరే పార్టీలోకి జంప్ కొడుతున్నారా? అని మీరు అనుకోవచ్చు కానీ.. అసలు విషయం అది కాదు. ఆయన రాజీనామా చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ఒక రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టాలంటే ఎమ్మెల్యే అయి అయినా ఉండాలి లేదా ఎమ్మెల్సీ అయి అయినా ఉండాలి. ఈయన ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్సీ కాదు. ఒక వేళ వీటిలో ఏ పదవి లేకున్నా.. ఓ 6 నెలల వరకు ఆ పదవిలో ఉండొచ్చు. పదవి చేపట్టిన ఆరు నెలల లోపు రెండింట్లో ఏదో ఒక పదవిని చేపట్టాల్సి ఉంటుంది. అయితే.. కిడారి శ్రవణ్ మంత్రి పదవి చేపట్టి మే 10 తో ఆరు నెలలు పూర్తవుతుంది. కానీ.. ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా కానీ.. ఎమ్మెల్సీగా కానీ ఎన్నికవలేదు. దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
ఇంకో రెండు రోజులే గడువు ఉండటంతో త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించనున్నారట.
ఇంతకీ ఈ కిడారి శ్రవణ్ ఎవరో తెలుసా? గత సంవత్సరం అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపేశారు కదా. ఆయన కొడుకే శ్రవణ్. ఆయన మావోయిస్టుల దాడిలో మరణించడంతో శ్రవణ్ కు చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. 11 నవంబర్, 2018 న కిడారి శ్రవణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.