రాకేష్ తమకున్న వ్యవసాయ భూమిలో కొంత భాగంలో మొదటగా చిన్న మొత్తంలో కూరగాయలను పండించాడు. అయితే వాటిని పండించేందుకు అతను ఎలాంటి కెమికల్స్, పురుగు మందులు వాడలేదు.
నేటి తరుణంలో వ్యవసాయం శుధ్ధ దండగ అనుకునే వారు చాలా మందే ఉన్నారు. వ్యవసాయం చేస్తే అప్పుల పాలు కావల్సి వస్తుందనో లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయో, అంతగా ఆదాయం రాదనో.. అనేక మంది ఆ రంగానికి దూరంగా ఉంటున్నారు. కానీ ప్రయత్నిస్తే అందులోనూ లాభాల పంట పండించవచ్చు. అవును, సరిగ్గా ఇదే సూత్రాన్ని అతను నమ్మాడు.. కనుకనే ఓ వైపు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరోవైపు వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అతను ఏటా లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అతనే.. హర్యానాకు చెందిన రాకేష్ సిహాగ్.
హర్యానాలోని బైజల్‌పూర్ గ్రామంలో నివాసం ఉండే రాకేష్ సిహాగ్‌కు నిజానికి వ్యవసాయం అంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. వారికి సాగు భూమి చాలానే ఉంది. కానీ అతను ఎన్నడూ వ్యవసాయం చేయాలని అనుకోలేదు. దీంతో అతను డిప్లొమా పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీర్‌గా నెలకు రూ.40వేల జీతానికి పనిచేసేవాడు. అయితే అనుకోని కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. దీంతో అతను వ్యవసాయంపై దృష్టి పెట్టాడు.
రాకేష్ తమకున్న వ్యవసాయ భూమిలో కొంత భాగంలో మొదటగా చిన్న మొత్తంలో కూరగాయలను పండించాడు. అయితే వాటిని పండించేందుకు అతను ఎలాంటి కెమికల్స్, పురుగు మందులు వాడలేదు. సాంప్రదాయమైన, సహజ సిద్ధమైన ఎరువులను ఉపయోగించాడు. ఆవుపేడ, మూత్రం, బెల్లం తదితరాలు కలిపిన జీవామృతంతోపాటు, చీడపీడల నుంచి పంటను కాపాడేందుకు మిరపకాయలు, ఇతర పదార్థాలతో మరొక సహజ సిద్ధమైన ఎరువును తయారు చేశాడు.
అలా రాకేష్ సహజ సిద్ధమైన పద్ధతిలో పూర్తిగా సేంద్రీయ ఎరువులనే వాడి పంటను పండించగా కొద్ది మొత్తం స్థలంలోనే అధిక దిగుబడి వచ్చింది. దీంతో రాకేష్ వెనుదిరిగి చూడలేదు. తమకున్న మొత్తం వ్యవసాయ భూమిని సాగు చేయడం మొదలు పెట్టాడు. పండ్లు, కూరగాయలను పండించడం మొదలు పెట్టాడు. దీంతో 2017లో రాకేష్‌కు రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. అలాగే 2018లో రూ.50 లక్షల ఆదాయం సంపాదించాడు. ఇక ఈ ఏడాదిలో రూ.1కోటి ఆదాయం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే రాకేష్ తన వ్యవసాయభూమిలో మరికొంత మంది స్థానికులకు పని కల్పించాడు. వారికి నెలకు రూ.9వేల జీతం ఇవ్వడంతోపాటు వారి పిల్లలను చదివించే బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. దీంతో చుట్టు పక్కల నివాసం ఉండే అందరూ రాకేష్‌ను అభినందిస్తున్నారు. ఏది ఏమైనా.. దేశంలోని రైతులందరూ ఈ తరహా వ్యవసాయం చేస్తే అప్పుడు లాభాలే కానీ, నష్టాలు రావు కదా..!