ఏపీలో నైరుతి రుతు పవనాల ప్రభావం జోరుగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రైతులు పద్మనాభం, గోవిందరాజుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో కలిసి పని చేస్తున్న లక్ష్మణ్ అనే రైతు అస్వస్థతకు గురి అయ్యాడు. దీంతో అతడిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే బాపట్లలో ఓ ఇంటిపై పిడుగు పడి బాలిక మృతి చెందింది.
కాగా, ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు వీధులు జలమయం అయ్యాయి. అనంతరపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. బాపట్ల జిల్లాలో పలు చోట్ల వర్షం భీభత్సం సృష్టించింది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వంతెనలు తెగి రాకపోకలకు ఇబ్బందిగా మారింది.