కొమురం భీం జిల్లా రెబ్బెన ఎస్ఐ భవానీ సైన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఎస్ఐని విధుల నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పేద కుటుంబానికి చెందిన ఓ యువతి ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంది. స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిసి.. యువతి సాయం చేయాలని కోరింది. దీంతో ఇదే అదునుగా భావించిన ఎస్ఐ ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాధిత యువతి డీఎస్పీ కార్యాలయానికి బంధువులతో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ భవానీ సేన్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుస్తకాల కోసం పోలీస్ స్టేషన్ వెళ్లిన యువతిని ఎస్ఐ మరుసటి రోజు రమ్మన్నాడు. మరుసటి రోజు వెళ్లిన యువతిని.. నీ ఎత్తు చూస్తానని చెప్పి.. నడుమును, శరీర భాగాలను తాకాడు. తన కోరిక తీర్చితే పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో యువతి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లిన యువతిపై ఎస్ఐ వేధింపులకు పాల్పడటంతో యువతి డీఎస్పీకి ఫిర్యాదుల చేసినట్లు పోలీసులు తెలిపారు.