ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. అతణ్ని విడిచి ఉండలేక పోతున్నానని సూసైడ్ నోట్ రాసి 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది.
మధ్యప్రదేశ్ ఛింద్వారాకు చెందిన ప్రథమ్ జైన్.. రాజస్థాన్‌లోని కోటాలోని ఓ హాస్టల్లో ఉంటూ ఐఐటీ శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే భవ్య అనే యువకుడిని ప్రేమించాడు. అతడి ప్రేమ విఫలం కావడం వల్ల సూసైడ్‌నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం చాలా ఖర్చు పెట్టారని.. తనను క్షమించాలని కోరుతూ తల్లిదండ్రులకు లేఖ రాశాడు.
“సారీ అమ్మ, నాన్న. నేను జీవించడానికి అర్హుడిని కాను. నేను చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కావట్లేదు. మీ డబ్బును వృథా చేసినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు తమ్ముడి చదవు కోసం ఖర్చు పెడితే చాలు. నా ప్రేమ నిజమైనది. కానీ అది ఓ అబ్బాయితో జరిగింది. నేను భవ్యను ఎంతో ప్రేమిస్తున్నాను.” – లేఖలో ప్రథమ్ జైన్
పోలీసుల కథనం ప్రకారం.. ప్రథమ్ జైన్ రెండు నెలల కింద ఐఐటీ కోచింగ్ కోసం కోటా వచ్చాడు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత స్నేహితులు కోచింగ్‌కు వెళ్లగా అతడు మాత్రం గదిలోనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో తలుపు తట్టినా తెరవలేదు. నిద్రపోతున్నాడని భావించిన స్నేహితులు.. సాయంత్రం మళ్లీ వచ్చి పిలిచారు. అనుమానం వచ్చిన స్నేహితులు, హాస్టల్ సిబ్బంది.. తలుపులు తెరిచి చూడగా.. ఉరివేసుకుని కనిపించాడు.
సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని వారికి అందజేశారు.