బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు మోడల్ అర్పితా ముఖర్జీ ఇళ్లలో రూ.50కోట్లకు పైగా నోట్ల కట్టలు, బంగారం బయటపడిన విషయం తెలిసిందే. దీంతో మంత్రితోపాటు అర్పిత అరెస్టవగా.. ఈ డబ్బుతో తమకెలాంటి సంబంధం లేదని ఆ ఇరువురు బుకాయించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమె ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని పార్థా ఛటర్జీ చెబుతుండగా.. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అనుమతి లేకుండానే తన ఇళ్లలో ఆ డబ్బు, నగలు పెట్టారని ఈడీ విచారణలో అర్పిత చెప్పినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని ఛజర్జీ పేర్కొన్నారు. ఎవరైనా కుట్రలు చేస్తున్నారా అని విలేకర్లు అడగ్గా.. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. 2014-2021 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు.. పార్థాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అర్పిత నివాసాల్లో సోదాలు జరపగా.. రూ.కోట్ల విలువైన కరెన్సీ నోట్ల కట్టలు, భారీగా బంగారం, కీలక దస్త్రాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే.