అంతా ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు శుక్రవారం ప్రకటించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు 35 బేసిస్ పాయింట్లు కాకుండా ఆర్బీఐ మరింత అధిక పెంపునకు మొగ్గుచూపడం గమనార్హం.
కొవిడ్ సంక్షోభం తర్వాత ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపోరేటును పెంచింది. మే నెలలో అనూహ్యంగా సమావేశమై 40 బేసిస్ పాయింట్లు.. జూన్ ద్వైమాసిక సమీక్షలో మరో 50 పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఆ భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించాయి. తాజా మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదాలు మరింత భారం కానున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు.. వృద్ధికి సహకారం అందించేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్బీఐ గత సమీక్షలోనే తెలిపింది. అంటే రెపోరేటు మరింత పెంచుతామనే సంకేతాలు అప్పుడే ఇచ్చింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం సర్దుబాటు వైఖరిని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తాజాగా ఉద్ఘాటించింది. ఈనెల 3న ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం వెల్లడించారు.