ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.
అనంతరం మంథని రోడ్డులో నిర్మించనున్న తెరాస కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ సముదాయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా 130 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనసమీకరణకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లాలోని కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కేసీఆర్ టూర్ సందర్భంగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.