నేటి యువతకు వివాహబంధంపై సరైన అవగాహన ఉండటం లేదని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. నేటి పాశ్యాత్త సంస్కృతి ప్రభావం వివాహ బంధాలపై పడుతున్నట్లు పేర్కొంది. యువత వివాహాన్ని చెడుగా భావిస్తున్నట్లు చెప్పింది. పెరుగుతున్న సహజీవనాలు సంస్కృతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించింది. భార్య తనపై వేధింపులకు పాల్పడుతోందని పేర్కొంటూ, విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి పిటిషన్‌ను కొట్టివేస్తూ.. జస్టిస్ ఎ.ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
కేరళలోని అలప్పుళ జిల్లాకు చెందిన ఓ జంటకు 2009లో వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతనికి 2017నుంచి మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్య ఆరోపిస్తోంది. భార్యే తనపై వైవాహిక క్రూరత్వానికి పాల్పడుతోందంటూ భర్త విడాకుల కోసం 2018లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. అతను తన ఆరోపణలను నిరూపించడంలో విఫలమయ్యాడని పేర్కొంటూ అతని పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు.
‘ప్రత్యేకంగా ఈ కేసులో.. తన భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భార్య నుంచి వచ్చే సాధారణ స్పందనను.. అసాధారణ ప్రవర్తన, క్రూరత్వంగా పేర్కొనలేం’ అని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. దంపతుల మధ్య చిన్నపాటి కలహాలు, సంసారంలోని సాధారణ ఆటుపోట్లు, భావోద్వేగాల ప్రకటనను క్రూరత్వంగా పరిగణించేందుకు నిరాకరించింది.