లోకేష్‌ ‘మాస్టర్‌’ప్లాన్‌… విజయ్‌ సినిమాలో విలన్‌గా స్టార్‌ బాలీవుడ్ హీరో!

-

విక్రమ్‌తో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న లోకేశ్‌ కనగరాజ్ తన తదుపరి చిత్రం దళపతి విజయ్‌తో ఉంటుందని ప్రకటించాడు. ప్రస్తుతం ‘వారసుడు’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్‌, అది పూర్తయిన వెంటనే దళపతి ‌67(వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో పాల్గొననున్నారు.

గ్యాంగ్‌స్టర్స్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో విలన్‌ పాత్రకోసం ఓ బాలీవుడ్ నటుడిని లోకేశ్‌ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్‌ చిత్రంలో క్రూరమైన ప్రతినాయకుడిగా, అధీర పాత్రలో అదరగొట్టిన సంజయ్‌దత్‌ దళపతి ‌67లో విలన్‌గా నటించనున్నారట. ఒక బలమైన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో సంజయ్‌దత్‌ను లోకేశ్‌ చూపించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీనిపై చిత్ర యూనిట్‌ ఎటువంటి ప్రకటనా విడుదల చేయనప్పటికీ సోషల్‌మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

గతేడాది విజయ్‌తో మాస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించిన లోకేశ్‌ కనగరాజ్‌, తదనంతరం విక్రమ్‌ చిత్రంతో తన సినిమాలపై భారీ అంచనాలు పెంచేశాడు. ప్రస్తుతం లోకేశ్‌ దర్శకత్వంలో సినిమా వస్తోందంటే అది ఎల్‌సీయూ(లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌) నేపథ్యమా? కాదా అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే దళపతి ‌67 ఎల్‌సీయూలో భాగం కాదని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకుముందు మాస్టర్‌ కూడా ఎల్‌సీయూలో భాగం కాకపోవడంతో, ఇది కూడా నాన్‌ ఎల్‌సీయూ సినిమాగా తెరకెక్కనుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా విజయ్‌ వర్సెస్‌ సంజయ్‌దత్‌ కాంబినేషన్‌పై ప్రేక్షకులకు భారీ అంచనాలుంటాయనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది(2023)దళపతి ‌67 విడుదలయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news