రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఖమ్మం జిల్లా ఇంజక్షన్ మర్డర్ కేసుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు హత్యల్లో ఉపయోగించిన ఇంజక్షన్లు ఒకే ఆస్పత్రి నుంచి తీసుకెళ్లినట్లు తొలుత పోలీసులు గుర్తించారు. కానీ తదుపరి పోలీసు అధికారులు క్షుణ్నంగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఇంజక్షన్లు ఒక ఆస్పత్రి నుంచి కాకుండా.. రెండు వేర్వేరు ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇంజక్షన్ల సరఫరాపై క్లారిటీ కోసం మూడ్రోజులుగా ఔషధ నియంత్రణ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. వీరి విచారణలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సమగ్ర వివరాలతో కూడిన విచారణ నివేదికను ఔషధ నియంత్రణ విభాగం అధికారులు ఖమ్మం జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. ఇంజక్షన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఇటీవల ఖమ్మం జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను ఇంజక్షన్ సాయంతో హతమార్చిన సంగతి తెలిసిందే. దీనికంటే ముందుగా ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యలు తరచూ గొడవ పడుతున్నారని రెండో భార్యకు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.