రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సి-1, డి-7, ఇ-4) 29, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకొని ప్రగతిభవన్‌కు వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆమోదం తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.