తెలంగాణ ఆడపడుచుల సంబురం సద్దుల బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి.. సంప్రదాయ దుస్తుల్లో మహిళలంతా ప్రకృతిలో మమేకమై ఆనందంగా ఆడుతూ పాడుతూ ఇవాళ గౌరమ్మకు వీడ్కోలు పలుకుతారు.
తొలి రోజు ఎంగిల పూల బతుకమ్మలతో ప్రారంభమైన ఈ పండుగ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు .దిల్లీ, ఇతర రాష్ట్రాల్లు సహా విదేశాల్లోనూ సందడిగా సాగాయి. పట్టణాలు. పల్లెలు, ధనిక పేదా అన్న తేడా లేకుండా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలను సేకరించి అందంగా పేర్చి కూర్చి సంబురాల్లో పాల్గొన్నారు.
పండుగ సంబురాలతో ఇళ్లన్నీ పూలవనాలుగా మారాయి. పుట్టింటికి వచ్చిన సంతోషం ముఖంలో తొణికసలాడుతుంటే మహిళలంతా 8 రోజుల పాటు పండుగలో పాల్గొన్నారు. ఇక ఇవాళ ఆఖరి రోజు సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు బతుకమ్మలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
మరోవైపు బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులతో పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసింది.