సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన బిఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. నేడు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ లో కొన్నిచోట్ల బిఆర్ఎస్ పేరుతో ఫ్లెక్సీలు వెలసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిపై స్పందించారు ఎపీ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. దోచిన సొమ్ముతో ఏపీలో ఫ్లెక్సీలు కడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలుగు తల్లికి క్షమాపణ చెప్పి ఏపీలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎందరో మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారని.. వారి కుటుంబాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడని అన్నారు. కేఏ పాల్ పార్టీకి, కెసిఆర్ పార్టీకి తేడా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లిని కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, ఏపీకి ఎలా తెస్తారో చెప్పాలని నిలదీశారు. దేశాన్ని ఏకం చేసే కేసిఆర్ ఏపీలో నీటి ప్రాజెక్టులపై తన వైఖరిని ప్రకటించాలని అన్నారు.