మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు.
అధికారం అడ్డుతో కేసీఆర్ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. హనుమకొండలోని అభిరామ్ గార్డెన్లో జరిగిన ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నరసయ్య సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన.. గుజ్జల నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాగి తందనాలు ఆడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.