ప్రతి గ్రామంలో 100 బెల్టు షాపులు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈనెల 9న నర్సాపూర్ మునిసిపల్ చైర్మన్ మురళి యాదవ్ బిజెపిలో చేరుతున్న నేపథ్యంలో సభాస్థలిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1000 నుంచి 1500 జనాభా ఉన్న పల్లెటూర్లలో పది నుంచి 15 బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు.
మద్యానికి బానిసై 40 ఏళ్లకే మగాళ్లు చనిపోతే.. ఆడపడుచులు ఆగమైపోతున్నారని అన్నారు. దళిత బంధు, గిరిజన బంధు, గొల్ల కురుమలకు గొర్రెలతో పాటు.. అన్ని కులాల్లోని పేదలకు పేదల బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఎకరా కోటి నుంచి మూడు కోట్ల పలికే భూములనును దళితులు, పేదల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. కంపెనీల పేరుతో కోట్ల విలువైన భూములకు కేవలం 10 లక్షలు ఇచ్చి కేసీఆర్ తన బంధు వర్గానికి ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.