ప్రధాని మోదీ కార్గిల్ సైన్యంతో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న సైనికులతో ఉండటం కంటే గొప్ప దీపావళి వేడుక తనకు మరేదీ లేదని మోదీ అన్నారు. సైనికులే తన కుటుంబమని, అందుకే పండగకు ఇక్కడకు వచ్చానని తెలిపారు.
‘‘జవాన్లతో కలిసి వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉంది. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు. మన సరిహద్దులను మీరు రక్షిస్తున్నారు కాబట్టే.. దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. సైన్యం శౌర్యపరాక్రమాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ త్యాగాలు మన దేశానికి గర్వకారణం’’ అని జవాన్లను ప్రధాని కొనియాడారు. సైనికుల్లాగే తాము కూడా దేశంలో అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం వంటి దుష్టశక్తులపై పోరాడుతున్నామని’’ మోదీ అన్నారు.
‘‘భారతదేశం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు. శక్తిసామర్థ్యాలు లేకుండా శాంతిస్థాపన చేయడం సాధ్యం కాదు. ప్రపంచ వేదికగా భారత బలం పెరిగిప్పుడు.. అది ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు అవకాశాలను పెంచుతుంది’’ అని మోదీ వెల్లడించారు.