రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. సునాక్ నేడు బకింగ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ తో భేటీ అనంతరం నెం.10 డౌనింగ్ స్ట్రీట్ లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయానికి విచ్చేశారు. ప్రధాని హోదాలో తొలి ప్రసంగం వెలువరించారు రిషి సునాక్. తన కంటే ముందు ప్రధానిగా వ్యవహరించిన లిజ్ ట్రస్ చేసిన తప్పిదాలను సరిదిద్దడం తనముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ ను ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ప్రజలు కొన్ని కఠిన నిర్ణయాలను ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు రిషి సునాక్.
“ఆర్థిక సుస్థిరత, ఆర్థిక భరోసా అంశాలు మా ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనవి. గతంలో తప్పులు జరిగాయి కాబట్టి, రాబోయే కాలంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. నాకంటే ముందు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన లిజ్ ట్రస్ కు నీరాజనాలు. ఆమె ఈ దేశాన్ని అభివృద్ధిచేయాలని భావించడం తప్పేమీకాదు. అది ఒక పవిత్ర లక్ష్యం. ఈ దిశగా ఆమె సాగించిన అవిశ్రాంత కృషిని అభినందిస్తున్నాను. ఈ క్రమంలో ఆమె కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. అయితే వాటి వెనుక చెడు ఉద్దేశాలు ఉన్నాయని చెప్పలేం. కానీ, ఆ తప్పిదాలను సరిదిద్దుతానన్న నమ్మకంతోనే ఇప్పుడు నన్ను పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని భావిస్తున్నాను.’ అని రిషి సునాక్ అన్నారు.