ప్రస్తుతం దేశ ప్రజాస్వామ్యానికి ఏర్పడిన ముప్పుతో పోరాడటమే అతిపెద్ద సవాల్ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. పార్టీ అధ్యక్షురాలిగా తన పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేసినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
‘‘ఖర్గేకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆయన చాలా అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన కృషితో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలవనున్నారు. ఇప్పుడు నేను ఆ బాధ్యతల నుంచి వైదొలగడంతో కొంత ఉపశమనం లభించింది. మార్పు ప్రకృతి ధర్మం’ అని సోనియా పేర్కొన్నారు.
‘‘కాంగ్రెస్ చాలా పెద్ద సవాళ్లను, ప్రమాదాలను గతంలో కూడా ఎదుర్కొంది. కానీ, ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. భవిష్యత్తులో పోరాడి విజయం సాధిస్తాం. కాంగ్రెస్ ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదు. ఓ చెక్కు చెదరని ఉద్యమంలా ఏళ్ల తరబడి నిలిచింది. పార్టీ ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఏర్పడిన ముప్పుతో పోరాడటమే అతిపెద్ద సవాల్’’ అని సోనియా గాంధీ.. పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం చేశారు.