తాను ఎలాంటి బిల్లులను ఆపలేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. బిల్లులను తొక్కి పెట్టానని తనను అనడం సబబు కాదని చెప్పారు. ప్రభుత్వం వద్ద నుంచి తన వద్దకు బిల్లులు వచ్చాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ప్రభుత్వ బిల్లుల విషయమై పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
‘‘ప్రభుత్వం నుంచి నా వద్దకు బిల్లులు వచ్చాయి. బిల్లుల విషయమై పరిశీలిస్తున్నాం. సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నా. ఆ బాధ్యత నాపై ఉంది. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాను. ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చాను. పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నా. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోంది. నేను ఎలాంటి బిల్లులు ఆపలేదు. బిల్లులను తొక్కిపెట్టాననడం సబబుకాదు. కొత్త విధానంపై నాకు సందేహాలు ఉన్నాయి. కొత్త విధానం అవసరమా? కాదా అని పరిశీలిస్తున్నాం.’’ అని గవర్నర్ అన్నారు.
వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయని.. తాను పదే పదే డిమాండ్ చేశాక వీసీలను నియమించారని గవర్నర్ చెప్పారు. 8 ఏళ్లుగా వీసీలను నియమించకపోతే ఐకాస ఎందుకు ఆందోళన చేయలేదని ప్రశ్నించారు. ఒక నెల తన వద్ద ఆగిపోగానే ఎందుకు ఆందోళన చేస్తున్నారని.. నియామకాల బిల్లుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చానని స్పష్టం చేశారు. బిల్లులను ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తున్నానని.. బిల్లులు పంపించగానే ఆమోదించడం మాత్రమే తన విధి కాదని.. తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యకరమని అన్నారు.