దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను సిట్ అధికారులు రెండోరోజు కస్టడీలోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేస్తున్నారు. నిందితుల వెనుక ఎవరున్నారు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ స్వామీల కాల్‌డేటా, సెల్‌ఫోన్‌లో వీడియోల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియో క్లిప్పింగులు చూపించి మరింత సమాచారం రాబడుతున్నారు. వారి మొబైల్‌ఫోన్లలో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమాచారం గురించి అడుగుతున్నారు.
తొలిరోజు నిందితులను ఎనిమిది గంటలకుపైగా వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఎరకు డబ్బు ఎక్కడిదని ఆరా తీస్తున్నారు. రామచంద్రభారతి వాంగ్మూలమే ఈ కేసులో కీలకం కానుందని సిట్ భావిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన ఆయనే ఎమ్మెల్యేలతో డబ్బుల గురించి మాట్లాడటం, పైలట్ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విషయంలో ఆయనను ప్రశ్నించడంపై సిట్ దృష్టి పెట్టింది. ఇవాళ మరోసారి కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.