యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న కొద్ది ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ప్రభాస్ నుంచి గత ఐదేళ్లలో కేవలం బాహుబలి సీరిస్ సినిమాలు మాత్రమే వచ్చాయి. ఇక సాహో సినిమా కోసం కూడా ఏకంగా రెండేళ్ల పాటు ప్రభాస్‌తో పాటు దర్శకుడు సుజీత్, టోటల్ యూనిట్ కష్టపడ్డారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సాహో మూవీ ప్రి రిలీజ్ బిజినెస్, నేషనల్ వైడ్‌గా సినిమాపై ఉన్న అంచనాలు, ఇతర భాషల్లో స్టార్ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్ వాయిదా వేసుకుని సాహో సోలో రిలీజ్‌కు దారివ్వడం చూస్తుంటే సాహోకు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ రేంజ్లో క్రేజ్ ఉన్నా సాహో హిట్‌పై కొందరు సోషల్ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్‌లు సినిమాపై ఉన్న బజ్‌తో పోలిస్తే అంచనాలు అందుకోలేనట్టుగా ఉన్నాయి.
ఈ పాటలపై ఓ వైపు సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ అయ్యిందో లేదో మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా సాహో అంచనాలు అందుకోవడం కష్టమే అన్న డౌట్ రైజ్ చేస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోలు ఆ తర్వాత, ఇంకా చెప్పాలంటే ఆ మరుసటి సినిమాతో హిట్ కొట్టలేదు. రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ ఆ నెక్ట్స్ సినిమా ఆ హీరోకు డిజాస్టరే అయ్యేది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, సునీల్, రవితేజ ఇలా అందరూ రాజమౌళితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి… ఆ తర్వాత ఘోరమైన డిజాస్టర్లు ఎదుర్కొన్నవారే. ఇప్పుడు బాహుబలి లాంటి నేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడం, కంటెంట్ పరంగా సినిమా అందరికి కనెక్ట్ అవుతుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మరి సాహో ఏం చేస్తాడో ? ఈ నెల 30న తేలిపోనుంది.