చిత్తూరులోని వార్డు వాలంటీరు శరవణ (32) ఆత్మహత్య చేసుకున్నారు. తన దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగితే, ఇవ్వబోమని చెప్పడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని వైసిపి నేతలు హెచ్చరించారని, వారి బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. చిత్తూరు నగరం 11వ డివిజన్ జోగుల కాలనీకి చెందిన శరవణ, వార్డు వాలంటీర్ గా పని చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో చీటీలు, వడ్డీ వ్యాపారాలు చేస్తుంటారు.
వైసిపి మైనారిటీ టౌన్ అధ్యక్షుడు షేక్ సయ్యద్, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి, సుమన్ తో పాటు మరికొంతమంది ఆయన వద్ద డబ్బులు తీసుకున్నారు. కొన్ని నెలల పాటు వడ్డీలు చెల్లించారు. ఆ తర్వాత ఆపేశారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని శరవణ వారిని అడిగారు. తాము ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మనుషులమని, డబ్బు అడిగితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని వాళ్ళు తనని బెదిరించినట్లు తెలిసింది. దాంతో భయాందోళనకు గురైన శరవణ జోగుల కాలనీలోని ఇంటి వద్ద ఉన్న వేప చెట్టుకు ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.