తెలంగాణలో అమెజాన్‌ మరో రూ.16 వేల కోట్ల పెట్టుబడి

-

ప్రపంచ ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న 3 డేటా కేంద్రాల్లో పెట్టుబడులను రూ.20,096 కోట్ల నుంచి రూ.36,300 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌కు సమాచారం అందించింది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. దీనిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో తొలిసారిగా 2020లో తెలంగాణలో 3 డేటా కేంద్రాల ఏర్పాటుకు అమెజాన్‌ ముందుకొచ్చింది. రాష్ట్రప్రభుత్వం వాటికి రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి, ఫ్యాబ్‌ సిటీ, ఔషధనగరిలలో భూములు కేటాయించగా.. నిర్మాణం చేపట్టింది. వాటిలో మొదటిదశ పూర్తయింది. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ‘సాధికారత భారత్‌’ సదస్సు నుంచి దావోస్‌లో ఉన్న మంత్రి కేటీఆర్‌తో సంస్థ భారత విభాగాధిపతి పునీత్‌ చందోక్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తమ అదనపు పెట్టుబడి, విస్తరణ ప్రణాళికను తెలిపారు.

‘‘భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్‌ సేవలను అందించాలన్న లక్ష్యంలో భాగంగా రూ.20,096 కోట్లతో హైదరాబాద్‌ చందన్‌వెల్లి, ఫ్యాబ్‌సిటీ, ఔషధనగరిలలో 3 డేటా కేంద్రాల నిర్మాణం చేపట్టి, మొదటిదశ పూర్తిచేశాం. ఈ కేంద్రాలకు సంబంధించి విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దశల వారీగా 2030 నాటికి రూ.36,300 కోట్లను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. భారతదేశంలో అమెజాన్‌కు హైదరాబాద్‌ ప్రాధాన్య గమ్యస్థానం. సంస్థ అతిపెద్ద ప్రాంగణం, సఫలీకృత కేంద్రం(ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌) ఇక్కడే ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నాం’’ అని పునీత్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news